డ్రగ్స్ మాఫియాపై డేగ కన్ను..
డ్రగ్స్ మాఫియాపై డేగ కన్ను..
మాదకద్రవ్యాలు వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తాయి
యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి
దేశానికే ఆదర్శంగా విప్లవాత్మక ఈగల్ ఏపీ
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి (ఓల్డ్ జీజీహెచ్) వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారందరూ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేస్తూ, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాల పై డేగ కళ్లతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాడిని చేరుకునేందుకు దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరమైన తీవ్ర దుష్పరిణామాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. యువత పెడదారి పట్టకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరిస్తున్నాయని, “నషా ముక్త్ భారత్ అభియాన్”లో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈగల్ ఏపీ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేలకు పైగా ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ చైతన్య ద్వారా రాష్ట్రంలో ‘జీరో గంజాయి సాగు’ లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో గంజాయి లేదా మాదకద్రవ్యాల కార్యకలాపాలు గుర్తిస్తే ప్రజలు 1972 ఈగల్ నంబర్ కు సమాచారం అందించాలని కోరారు. డ్రోన్ నిఘా ద్వారా హాట్స్పాట్ ప్రాంతాల్లో మంచి ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. ఈగల్ ఏపీ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ చైర్మన్ డా. జి.సమరం, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, ఎన్ఎస్ఎస్, ఎన్ సీ సీ అధికారులు, విద్యార్థులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
