Telangana Voter Survey | ప్రారంభమైన ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ

Telangana Voter Survey | ప్రారంభమైన ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ

Telangana Voter Survey | జులై 24 వరకు ఇంటింటి మెగా సర్వే..
బీఎల్‌వోల కీలక బాధ్యతలు
మ్యాపింగ్, అన్‌మ్యాపింగ్ అంటే ఏమిటి?
ఓటర్లు తెలుసుకోవాల్సిన విషయాలు
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా..
అభ్యంతరాలకు పూర్తి అవకాశం

Telangana Voter Survey | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గురువారం రాష్ట్రమంతటా ప్రారంభమైంది. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో రెండు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లిష్‌లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను ఓటర్లకు అందించారు. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వోలు) ప్రతిరోజూ కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుని తొలి రోజు ఇంటింటికీ తిరిగారు. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకూ వాటిని ఇవ్వనుండగా, ఓటర్లు ఆ ఫారమ్‌లను పూర్తి చేసి వచ్చే నెల 24లోపు బీఎల్‌వోలకు అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న ఈ ప్రక్రియలో బీఎల్‌వోలు ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేసి వాటిని ఎలా నింపాలో వివరించారు. ఓటర్లు పూర్తి చేసిన రెండు పత్రాల్లో ఒకటి బీఎల్‌వో తీసుకుని, రెండో దాన్ని రసీదుగా ఇవ్వడం ప్రారంభించారు. తెలంగాణలో ఈ ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు) 33 మంది, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్వోలు) 119 మంది, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్వోలు) 882 మంది, బీఎల్‌వో పర్యవేక్షకులు 3,596 మంది, బీఎల్‌వోలు 35,985 మందిని నియమించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 35,985 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది ఉన్నారు.

గురువారం రాష్ట్రమంతటా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్దగా ఉత్సాహం చూపలేదు. భవిష్యత్తులో మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే కచ్చితంగా ఈ సర్వే ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని అధికారులు వెల్లడించారు. అధికారులు అడిగిన పత్రాలు చూపించి ఓటు హక్కును నిర్ధారించుకోవాలని, వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయినా, సరైన పత్రాలు చూపించలేకపోయినా ఓటు ప్రమాదంలో పడుతుందని ఎన్నికల సంఘం వివరించింది.

తెలంగాణ వ్యాప్తంగా 3,38,26,228 మంది ఓటర్ల డేటాను వడపోసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. కేవలం ఓటు ఉండటమే కాదు, అందులో ఓటరు ఫొటో, పేరు, చిరునామా అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఇదే సరైన సమయంగా నిలవనుంది. ఒకవేళ ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది.

జులై 24 వరకు మెగా సర్వే

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గురువారం నుంచి జులై 24 వరకు, అంటే నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈ యజ్ఞంలో దాదాపు 36 వేల మంది బీఎల్‌వోలు పాల్గొంటున్నారు. ప్రతి బీఎల్‌వో తన బూత్ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్లకు రెండు ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తున్నారు. ఆ బీఎల్‌వోలు ప్రతి ఇంటినీ మూడు సార్లు సందర్శిస్తారు.

మ్యాపింగ్, అన్‌మ్యాపింగ్ అంటే ఏంటి?

చాలా మంది ఓటర్లకు వచ్చే పెద్ద సందేహం ఇదే. బీఎల్‌వోలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఓటు మ్యాపింగ్ అయిందా లేదా అన్‌మ్యాపింగ్ అయిందా అనే వివరాలు వారి వద్ద ఉంటాయి. ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే లేదా మీరు ఇల్లు మారితే ఎలా నింపాలో బీఎల్‌వోలు మీకు చెబుతారు. ఒకవేళ మీ వద్దకు బీఎల్‌వో రాకపోయినా, లేదా ఏదైనా సందేహం ఉన్నా వెంటనే 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

వచ్చే నెల 24న ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 31న డ్రాఫ్ట్ జాబితా ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాపై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమర్పించవచ్చు. కొత్త ఓటు కోసం లేదా చిరునామా మార్పు వంటి వాటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిశీలన కోసం జులై 31 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఎన్నికల కమిషన్ అధికారులు నోటీసులు ఇస్తారు. అప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొన్న 12 ఆధారాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. బీఎల్‌వోలు వాటిని పరిశీలించి ధ్రువీకరిస్తే తుది జాబితాలో పేరు చేరుస్తారు. అక్టోబర్ 1న రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది.

రాష్ట్రంలో 3 కోట్ల 38 లక్షల 29 వేల 18 మంది ఓటర్లు ఉండగా, 69.92 శాతం అంటే 2 కోట్ల 36 లక్షల 54 వేల 232 మంది ఓటర్ల వివరాలు 2002లోని ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులతో మ్యాచ్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 35.73 శాతం అంటే 1 కోటి 1 లక్ష 74 వేల 786 మంది ఓటర్ల వివరాలు సరిపోలలేదు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 35.73 శాతం అంటే 89 లక్షల 44 వేల 713 మంది పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. వీటిపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు.