26thJunechintana | సంప్రదాయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత

26thJunechintana | సంప్రదాయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత

26thJunechintana | శుభకార్యాలకు పచ్చని పందిరి ఎందుకు వేస్తారు?
మామిడాకులు, తాటాకుల వెనుక ఉన్న శాస్త్రీయ విశిష్టత
పందిరి పూజ నుంచి భూతదయ వరకు గొప్ప సంప్రదాయం
ఆధునిక అలంకరణలతో కనుమరుగవుతున్న పచ్చని సంస్కృతి

26thJunechintana | ఇప్పుడైతే పుట్టినరోజుల వంటి చిన్న వేడుకల నుంచి పెద్ద పెద్ద శుభకార్యాల వరకు ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుంటున్నాం. కానీ, మన వెనుకటి తరాలలో ఎంత పెద్ద శుభకార్యమైనా ఇంటి ముంగిటనే పందిరి వేసి నిర్వహించేవారు.

ఇంటి ముంగిట వీధిలో నాలుగు దిక్కులా నాలుగు పందిరి గుంజలు పాతి, తాటాకులతో పైకప్పును చిక్కగా అల్లి, కింద అరటి స్తంభాలు, కొబ్బరి మట్టలు కట్టి, మామిడాకుల తోరణాలతో, బంతి, చేమంతి వంటి పూల హారాలతో అందంగా పందిరిని తీర్చిదిద్దేవారు. సహజమైన, పర్యావరణ హితమైన పచ్చని ఆకులు, పువ్వులతో కూడిన ఆ పందిరి ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతోందని అందరికీ చాటి చెప్పేది. ఎందరో బంధుమిత్రులు తరలివచ్చినా వారి బాతాఖానీలు, ఫలహారాలు, భోజనాలు, పిల్లల ఆటపాటలు, శుభకార్య వేడుకలు అన్నింటికీ ఆ పందిరే వేదికగా అమరేది.

చెట్టునుంచి కోసిన వారం రోజుల వరకు (వేసవిలో తప్ప) మామిడాకులు తాజాగా ఉండడమే కాకుండా ప్రాణవాయువును విడుదల చేస్తూ, బొగ్గుపులుసు వాయువును స్వీకరించే శక్తిని కలిగి ఉంటాయట. అరటి, తాటాకులు సానుకూల శక్తిని పరిసరాలకు ప్రసరింపజేస్తాయని కూడా చెబుతారు.

అన్నట్లు పందిరి వేయడానికి, తీయడానికి కూడా పెళ్లి ముహూర్తాలు నిర్ణయించినప్పుడే మంచి రోజులు చూసి, ఆ రోజులలోనే పందిరి పూజ చేసి మరీ ఆ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పందిరికి కట్టిన కొబ్బరి ఆకులతో పీకలు, బూరలు, పడవలు, రకరకాల వంట సామాగ్రిలాంటి ఆటవస్తువులు తయారు చేసుకుని పిల్లలు వాటితో ఆడుకుంటారు. పందిరి గుంజల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తూ పెళ్లింటికి శోభ తీసుకొస్తారు.

పందిరి ఉన్నన్ని రోజులూ చేసిన ప్రత్యేక వంటకాలను పందిరికి నివేదించి, పందిరిపైన పక్షుల కోసం, ఇతర ప్రాణుల కోసం వాటిలో కొంత భాగం పెట్టి ఉంచుతారు. ఇది భూతదయ. సకల ప్రాణుల పట్ల ప్రేమాభిమానాలు ఉండాలని నేర్పే ఒక సదాచారం.

ఇలా పందిరి శుభానికి, ఐక్యతకు, అనుబంధాలకు, దైవానుగ్రహానికి, ప్రకృతితో మరియు సకల ప్రాణులతో సమన్వయం సాధించడానికి ప్రతీకగా నిలుస్తోంది. కృత్రిమమైన అలంకరణలు, హంగు, ఆడంబరాలతో ఇప్పుడు విలాసవంతంగా ఈవెంట్ మేనేజర్ల చేత అలంకరించబడుతున్న పెళ్లి లేదా ఇతర శుభకార్యాల వేదికలలో అలాంటి పవిత్ర భావాలు మచ్చుకైనా కనిపించడం లేదన్నది వాస్తవం.

– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి