మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

విజయవాడ, ఆంధ్రప్రభ: యువత మత్తు పదార్థాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సహాయ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.వి. రామశివ సూచించారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆర్.వి. రామశివ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. విద్యార్థులు చెడు స్నేహాలు, అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విద్యార్థులకు వివరించారు.

సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు యువతే కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టాఫ్ కూడా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో పరస్పర చర్చలు నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.