పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

భీమ్‌గల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైద్యాధికారి డాక్టర్ అజయ్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాలతో పాటు భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో కూడా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
వైద్యాధికారి డాక్టర్ అజయ్ మాట్లాడుతూ, జూన్ 28ను “పోలియో ఆదివారం”గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని పేర్కొన్నారు.

ఎలాంటి చిన్నారి మిగిలిపోకుండా గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని కోరారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్సై సీహెచ్. తిరుపతి, మున్సిపల్ మేనేజర్ నరేందర్, ఐసీడీఎస్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, నాయకులు బీ. స్వామి, నర్సయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.