ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌పై ఏసీబీ పంజా..

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు
  • కరీంనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము ఇంట్లో సోదాలు
  • రూ.87.44 లక్షల విలువైన నగదు, బ్యాంకు డిపాజిట్లు, స్థిరాస్తుల గుర్తింపు

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌పై ఏసీబీ పంజా విసిరింది. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌పై గుండేటి రాముపై ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. తన అధికార హోదాను దుర్వినియోగం చేసి.. చట్టవిరుద్ధంగా ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. అనంత‌రం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు అధికారులు.

ప్రస్తుతం కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గుండేటి రాము గతంలో వేములవాడ ఎస్‌హెచ్‌వోగా కూడా విధులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన జగిత్యాల భవానీనగర్‌లోని అద్దె నివాసంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

సోదాల్లో రూ.20.67 లక్షల నగదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో రూ.29.88 లక్షలు, తండ్రి పేరుతో ఉన్న యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.16.77 లక్షల డిపాజిట్లు గుర్తించారు. అలాగే రూ.11.97 లక్షల విలువైన ఇతర వస్తువులు, కరీంనగర్‌లో రూ.6.05 లక్షల విలువైన ఓపెన్ ప్లాట్, సిరిసిల్లలో రూ.2.18 లక్షల విలువైన వాణిజ్య స్థలం ఉన్నట్లు గుర్తించారు.

డాక్యుమెంట్ల ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన చర, స్థిరాస్తుల మొత్తం విలువ రూ.87.44 లక్షలుగా అధికారులు వెల్లడించారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల అసలు విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

గుండేటి రాము తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ కేసులో మరిన్ని ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.