తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాల చోరీ

బెల్లంపల్లి ఆంధ్రప్రభ:బెల్లంపల్లి పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల హనుమాన్‌బస్తీలో రిటైర్డ్ కార్మికుడి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 3.5 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు అపహరించబడినట్లు బాధితులు తెలిపారు.

వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌బస్తీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ కార్మికుడు బొల్లబత్తుల రాజయ్య గత శనివారం బంధువుల ఇంటికి గోదావరిఖనికి వెళ్లాడు. గురువారం ఆయన సోదరుడు బొల్లబత్తుల మల్లేష్ ఇంటికి వెళ్లగా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌ టీమ్‌ల సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తాళాలు పగులగొట్టినట్లు గుర్తించారు. బీరువాలో భద్రపరిచిన మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దొంగలను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.