మత్స్యకారులకు సాంకేతిక రక్షణ కవచం.. స్మార్ట్‌గా వేట!
- మత్స్యకారులకు ట్రాన్స్‌పాండర్ రక్షణ కవచం
- ప్రమాదంలో వెంటనే సమాచారం
- తుపాన్లపై ముందస్తు హెచ్చరికలు
- వేటలోనూ సాంకేతిక సహాయం
- చేపల వేటలో సమయం, శ్రమ ఆదా
- పరికరాల వినియోగంపై అవగాహన
- మత్స్యకారులకు కొత్త భరోసా
అమరావతి, ఆంధ్రప్రభ: సముద్రంలో వాతావరణం ఎప్పుడు మారుతుందో చెప్పలేని పరిస్థితుల్లో మత్స్యకారుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంవై) కింద అమలు చేస్తున్న వెసెల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ (వీసీఎస్ఎస్) ద్వారా సముద్ర వేట బోట్లకు ట్రాన్స్పాండర్లను అమర్చుతోంది. ఇస్రో సాంకేతిక సహకారంతో రూపొందిన ఈ వ్యవస్థ ద్వారా నడి సముద్రంలో ఉన్న బోట్లకు తీరంలోని నియంత్రణ కేంద్రాలతో నిరంతర సంబంధం కొనసాగుతుంది. 2026 నాటికి దేశవ్యాప్తంగా లక్ష సముద్ర వేట బోట్లకు ఈ వ్యవస్థను విస్తరించేందుకు కేంద్రం రూ.364 కోట్ల ప్రాజెక్టును ఆమోదించింది.
ప్రమాదంలో వెంటనే సమాచారం
ట్రాన్స్‌పాండర్ అమర్చిన బోటులో ప్రమాదం తలెత్తితే మత్స్యకారుడు అత్యవసర బటన్ నొక్కగానే ఉపగ్రహ వ్యవస్థ ద్వారా నియంత్రణ కేంద్రానికి సమాచారం చేరుతుంది. బోటు ఉన్న కచ్చితమైన స్థానాన్ని గుర్తించి కోస్ట్ గార్డ్, సముద్ర భద్రతా బృందాలు, సహాయక సిబ్బంది వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. తుపాన్లు, భారీ అలలు, ప్రతికూల వాతావరణం, నో-ఫిషింగ్ జోన్లు, అంతర్జాతీయ సముద్ర సరిహద్దులపై కూడా ముందస్తు హెచ్చరికలు అందుతాయి. జియో-ఫెన్సింగ్ సదుపాయంతో నిషేధిత ప్రాంతాలకు చేరితే వెంటనే అలర్ట్ వస్తుంది.
వేటలోనూ సాంకేతిక సహాయం
ఈ వ్యవస్థ భద్రతకే పరిమితం కాదు. చేపలు ఎక్కువగా లభించే పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ సమాచారాన్ని కూడా మత్స్యకారులకు అందిస్తుంది. దీంతో చేపల కోసం ఎక్కువ దూరం వెతకాల్సిన అవసరం తగ్గి డీజిల్, సమయం, శ్రమ ఆదా అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ చేపల వేటకు అవకాశం కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌కు 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. రాష్ట్ర మత్స్యశాఖ గణాంకాల ప్రకారం 2024-25లో 20,812 మత్స్యకార బోట్లు డీజిల్ సబ్సిడీ పొందుతున్నాయి. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు 300 లీటర్ల వరకు లీటరుకు రూ.9 సబ్సిడీ అందుతోంది. రాష్ట్రంలో సుమారు 1.17 లక్షల మంది సముద్ర మత్స్యకారులు జీవనోపాధిగా మత్స్యవేటపై ఆధారపడి ఉన్నారు.
పరికరాల వినియోగంపై అవగాహన
ఇప్పటికే కొన్ని బోట్లలో ట్రాకింగ్ పరికరాలు అమర్చినా వాటిని నిరంతరం ఆన్‌లో ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. పరికరాలు ఆఫ్ ఉండడం వల్ల అంతర్జాతీయ సముద్ర సరిహద్దులు దాటడం, అత్యవసర పరిస్థితుల్లో ఆచూకీ గుర్తించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. అందుకే మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లన్నింటికీ ట్రాన్స్పాండర్లను విస్తరించడంతో పాటు మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ట్రాన్స్‌పాండర్ వ్యవస్థతో సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రత పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు కూడా కొత్త భరోసా కలగనుంది. నడి సముద్రంలో వేటకు ఇది సాంకేతిక రక్షణ కవచంగా మారనుంది.
