కృష్ణా, గోదావరి కన్నా ముందే నదులు.. కోట్లాది ఏళ్ల క్రితమే ప్రవాహాలు!
- కోట్లాది ఏళ్ల నాటి నదుల జాడలు
- గోదావరి తీర అన్వేషణలో అద్భుత ఆధారాలు
- 21 అడుగుల భారీ వృక్ష శిలాజం
- 160 మిలియన్ సంవత్సరాల నాటి శిలాజాలు
- విస్తృతంగా తవ్వకాలు జరగాలి
- కోట్లాది ఏళ్ల క్రితం నదుల దారులు
- ప్రాచీన నదుల ప్రవాహాలను చెబుతున్న శిలాగోళాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మానవాళి నడుస్తున్న పృథ్వి కింద ఎన్నో కోట్ల నాటి చరిత్ర నిక్షిప్తమైంది. మనుషుల పుట్టుక కన్నా ముందు కాలంలో ప్రకృతి స్వయంగా లిఖించిన చరిత్ర క్రమేణా వెలుగు చూస్తున్నది. ఆ చరిత్ర పుటల్లో కోట్లాది సంవత్సరాల శిలాజాలు, డైనోసార్ల అవశేషాలు, భూమి పొరల్లో రాళ్లుగా, బొగ్గుగా మారిన చెట్లు, ప్రాచీన నదుల ప్రవాహాల జాడలెన్నో ఉన్నాయి. గోదావరి తీరప్రాంతం అంతరంగాల్లోని అంశాలను పరిశోధిస్తే ఎన్నో అద్భుతాలు చరిత్ర యవనికపై ఆవిష్కృతమవుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో ఆదిమ మానవుడికి ముందు కోట్ల సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు ఇటీవల పురావస్తు, భూగర్భ పరిశోధకులకు లభ్యం కావడంతో తెలంగాణ చరిత్ర మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఏటూరు నాగారం, ములుగు, అంబటిపల్లి, ప్రాణహిత సంగమం ప్రాంతంలో భూగర్భ జలాల అన్వేషణల సర్వేలతోపాటు ప్రాచీన శిలాజాలపై జరిగిన పరిశోధనల్లో కనిపించిన అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. గోదావరి నదికి ముందు కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నది ప్రవాహాలు ఉన్నట్లు శిలాజాలపై స్పష్టమైన ఆధారాలు లభించాయి. భూగోళం అనేక పరిణామాలు చెందడంతో నదులు అంతర్వాహినిలా భూగర్భంలోకి చొచ్చుకుపోయాయి.
కన్నాయిగూడెం మండల పరిధిలో ఏకంగా 21 అడుగుల ఎత్తైన భారీ వృక్ష శిలాజాన్ని పరిశోధకులు గుర్తించి కోట్లాది సంవత్సరాల చరిత్రను ఆవిష్కరించారు. ఈ భౌగోళిక పొరల అమరిక ఆధారంగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెం మండలాల పరిధిలో ఇలాంటి పెట్రిఫైడ్ వుడ్ శిలాజాలు మరిన్ని లభించే అవకాశాలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ములుగు జిల్లా ముల్కపల్లి, భూపతిపురం, దేవాదుల కారిడార్లో సిలీకృత కలప శిలాజాలు, సిలిసిఫైడ్ వృక్ష కాండం (మొదలు) లభించాయి. అలాగే ప్రత్యేక కాండంతో వృద్ధి చెందిన వృక్షం వలయాలు లభించాయి. వీటి వయస్సు సుమారు 160 మిలియన్ సంవత్సరాలుగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
విస్తృతంగా తవ్వకాలు జరగాలి: పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చిన్నారెడ్డి
భూగోళం ఏర్పడక ముందు ఎన్నో పరిణామాలు సంభవించినట్లు పరిశోధనల్లో స్పష్టం అవుతున్నదని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ చిన్నారెడ్డి తెలిపారు. చరిత్ర అవశేషాలతోపాటు కోట్లాది సంవత్సరాల భూగోళ చరిత్రకు ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి తదితర నదుల పుట్టుకకు కోట్ల సంవత్సరాల ముందే నది ప్రవాహాలు ఉండేవని భూగర్భ పరిశోధనల్లో స్పష్టం అవుతున్నదని చెప్పారు. కోటిలింగాల తవ్వకాల్లో శాతవాహనుల సమగ్ర చరిత్ర లభ్యం కావడంతోపాటుగా గుప్త సామ్రాజ్య ఆధారాలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు.
కోట్లాది ఏళ్ల క్రితం నదుల దారులు
భూగర్భ జల శాఖకు లభ్యమైన వాటిలో బంతి లాంటి గుండ్రటి రాళ్లు (శిలాగోళాలు / రాతి బంతులు / గుండ్రాళ్లు), రాళ్లు, ఇసుక ఒకే బండగా అతుక్కుపోయిన శిలాజాలు నదీ ప్రవాహాల తీరును వివరిస్తున్నాయి. వేలాది సంవత్సరాలపాటు నది ప్రవాహంలో ఒకదానికొకటి రాపిడికి గురై గోళాకారంలోకి రూపాంతరం చెందాయి. ఇక చిన్న రాళ్లు, ఇసుక సహజ సిద్ధమైన సిమెంట్ లాంటి పదార్థాలతో కలిసి ఒక్కటిగా గట్టిపడిపోయాయి. ఇవన్నీ ములుగు ప్రాంతంలో ఒకప్పుడు ఉధృతంగా ప్రవహించిన ప్రాచీన నదుల అవశేషాలను వివరిస్తున్నాయి.
ఈ అరుదైన రాళ్లను భూగర్భ జలశాఖ కార్యాలయంలో ఉంచడం వెనుక పెద్ద శాస్త్రవేత్తల పరిశోధనలు మరిన్ని ఉన్నాయి. ఈ రాళ్లు భూమి లోపల నీటి జాడను కనిపెట్టడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. భూమి అడుగున నీటి పొరలు ఏయే రాళ్ల శ్రేణుల్లో దొరుకుతాయో అర్థం చేసుకోవడానికి ఈ రాళ్లు ప్రేరణగా నిలుస్తున్నాయి. రాళ్ల నమూనాలు, వాటి ప్రాచీనతతో కోట్లాది సంవత్సరాల క్రితం భూమి అగ్నిగోళంగా మండి చల్లారిన అనంతరం నదుల పుట్టుక జరిగిందని తెలుస్తున్నది.
ప్రాణహిత-గోదావరి పరీవాహక ప్రాంతాల్లో డైనోసార్ల అస్థిపంజరాలు, ప్రాచీన వృక్ష శిలాజాలు వెలుగు చూశాయి. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లిలో రాక్షసబల్లి పూర్తి పంజరం లభించింది. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లాలో ఒక ఊరి పేరు బొక్కల గుట్టగా ప్రసిద్ధి చెందింది. సుమారు 20 నుంచి 15 కోట్ల సంవత్సరాల క్రితం అప్పర్ జురాసిక్ కాలంలో సంభవించిన భారీ విపత్తుల కారణంగా నాటి మహా వృక్షాలు భూమి పొరల్లో కప్పబడిపోయాయని భూగర్భ జలశాఖ అధికారులు నిర్ధారించారు.
గోదావరి తీరప్రాంతాలు సింగరేణి బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందాయి. కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలోకి జారుకున్న వృక్షాలే.. మనం చూస్తున్న, వినియోగిస్తున్న రాక్షస బొగ్గు.
