ఒక రాత్రి.. రెండు చీకట్లు.. ఆకాశంలో ఖగోళ అద్భుతాలు!

  • 1912 తర్వాత స్పెయిన్‌లో ఇదే తొలిసారి
  • ఒకే రాత్రి మూడు ఖగోళ అద్భుతాలు
  • డబుల్ డార్క్‌నెస్ అనుభూతి
  • సమీప పట్టణాల్లో హోటళ్లు ఫుల్
  • ఉల్కాపాతానికి అద్భుతమైన ప్రదేశం
  • ఖగోళ ప్రేమికులను ఆకర్షిస్తున్న చిన్న గ్రామం

సాధారణంగా సూర్యాస్తమయం అంటే ఒకసారి చీకటి పడటం.. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రాలు మెరవడం మనకు తెలిసిందే. కానీ స్పెయిన్‌లోని ఓ చిన్న గ్రామానికి మాత్రం ఈ నెల 12వ తేదీ రాత్రి ప్రకృతి అరుదైన ఖగోళ విందును అందించనుంది. ఉత్తర స్పెయిన్‌లోని బర్గోస్ ప్రావిన్స్‌లో ఉన్న అవెల్లనోసా డి మునో గ్రామం ఈ అపూర్వ దృశ్యానికి వేదిక కానుంది. కేవలం 10 మంది శాశ్వత నివాసులున్న ఈ గ్రామానికి వేలాది మంది ఖగోళ ప్రియులు ఈ నెల 12న తరలిరానున్నారు.

ఈ ప్రాంతం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే మార్గంలో ఉంటుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో పగటి వెలుతురు ఒక్కసారిగా మాయమవుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సూర్యకాంతి తిరిగి వస్తుంది. అయితే అంతలోనే సహజ సూర్యాస్తమయం జరగడంతో మరోసారి చీకటి అలుముకుంటుంది.

1912 తర్వాత స్పెయిన్‌లో ఇదే తొలిసారి

ఈ సంపూర్ణ సూర్యగ్రహణం 1912 తర్వాత తొలిసారి స్పెయిన్ ప్రధాన భూభాగం నుంచి కనిపించనున్నది. అలాగే యూరప్ ప్రధాన భూభాగం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించడం 1999 తర్వాత ఇదే మొదటిసారి. దీంతో దశాబ్దాల తర్వాత యూరప్‌లో జరుగుతున్న అతిపెద్ద ఖగోళ కార్యక్రమాల్లో ఇది ఒకటిగా నిలవనుంది.

అంతేకాదు.. అదే రాత్రి మరో అద్భుతం ఆకాశ వీక్షకులను అలరించనుంది. ప్రతి ఏడాది కనిపించే పెర్సీడ్ ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. దీంతో సూర్యగ్రహణం, సూర్యాస్తమయం, ఉల్కల వర్షం.. ఇలా ఒకే రాత్రి వరుసగా మూడు ఖగోళ అద్భుతాలను వీక్షించే అవకాశం లభించనుంది.

అంటే ఒకే సాయంత్రంలో రెండుసార్లు చీకటి పడే అరుదైన ‘డబుల్ డార్క్‌నెస్’ అనుభూతి ఆకాశ వీక్షకులకు లభించనుంది. గ్రహణం సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందు సంభవించనుండటమే ఈ ప్రత్యేకతకు కారణం.

సమీప పట్టణాల్లో హోటళ్లు ఫుల్

అవెల్లనోసా డి మునోలో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఆధునిక పర్యాటక సదుపాయాలు పెద్దగా లేవు. అయినప్పటికీ ఖగోళ ప్రేమికులకు ఈ గ్రామం ఆకర్షణగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వసతి సదుపాయాలు చాలా ముందుగానే బుక్ అయ్యాయి. సమీపంలోని చారిత్రక పరడోర్ డి లెర్మా హోటల్‌లో 2022 నుంచే గ్రహణం కోసం గదులన్నీ బుక్ అయినట్లు సమాచారం.

గ్రామం చుట్టూ విస్తరించిన గోధుమ పొలాలు, కొండ ప్రాంతాలు పశ్చిమ దిశలో ఆకాశాన్ని స్పష్టంగా చూడటానికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ వెలుతురు తక్కువగా ఉండటం వల్ల రాత్రి ఆకాశంలో ఉల్కాపాతాన్ని వీక్షించేందుకు ఇది అద్భుతమైన ప్రదేశంగా మారింది.

అరుదైన దృశ్యాన్ని చూసేందుకు పెద్ద నగరాల కంటే ఇలాంటి చిన్న, ప్రశాంతమైన ప్రాంతాలనే ‘ఎక్లిప్స్ చేజర్లు’ ఎంచుకుంటున్నారు. గ్రామాన్ని విడిచి వెళ్లిన నివాసులు కూడా తిరిగి రానున్నారని స్థానికులు చెబుతున్నారు.

సమీపంలోని ఒక గుహ ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి చుట్టుపక్కల విస్తరించిన గ్రామీణ ప్రాంతాన్ని వీక్షించాలని స్థానికురాలు సారా అల్వారెజ్ రోడ్రిగెజ్ సూచించారు. ఆగస్టు 12న రాత్రి ఈ చిన్న గ్రామం.. ప్రపంచ ఖగోళ ప్రేమికుల దృష్టిని ఆకర్షించనుంది.