గ్రామ సర్పంచ్‌ బెదిరింపుల పర్వం

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: రాజన్నపేట గ్రామ పంచాయతీ ఖర్చులపై వార్త ప్రచురించడంపై ఆంధ్రప్రభ రిపోర్టర్‌ను గ్రామ సర్పంచ్‌ ఫోన్‌లో బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. “నీ వంతు చూస్తా.. నువ్వెక్కడ ఉన్నావ్‌.. నువ్వెవ్వడు.. నీకు వార్తలు రాసే హక్కు ఎవరిచ్చారు.. నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నావో చెప్పు.. నీ దగ్గరకు వచ్చి నీ సంగతి చూస్తా” అంటూ సర్పంచ్‌ దురుసుగా మాట్లాడినట్లు రిపోర్టర్‌ తెలిపారు. పంచాయతీ ఖర్చులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ ఇటీవల ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైన నేపథ్యంలోనే ఈ ఫోన్‌ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలు, పంచాయతీ పాలన, ప్రజాధనం వినియోగంపై ప్రశ్నించడం పాత్రికేయుల బాధ్యత కాగా, వార్త నచ్చలేదనే కారణంతో బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమనే చర్చ జరుగుతోంది.

ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాత్రికేయులను బెదిరించే ఘటనలపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు, రాజన్నపేట గ్రామ పంచాయతీ ఖర్చులపై వచ్చిన ఆరోపణలతో పాటు రిపోర్టర్‌కు చేసినట్లు చెబుతున్న బెదిరింపులపైనా సంబంధిత అధికారులు విచారణ చేపడతారా అనేది వేచి చూడాల్సి ఉంది.