ఓటరు జాబితాను పారదర్శకంగా నిర్వహించాలి..
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తహసీల్దార్ రమేష్‌బాబు బీఎల్‌వోలను ఆదేశించారు.
బుధవారం మండల కేంద్రంలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని, ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలపై బీఎల్‌వోలకు పలు సూచనలు చేశారు.
రెండు దశాబ్దాల తర్వాత ఓటరు జాబితాను సమగ్రంగా సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్న తహసీల్దార్, ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని సూచించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు.
ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని, ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీఓ పాషా, బీఎల్‌వో విమల తదితరులు పాల్గొన్నారు.
