13-Officials-Corruption-Case : కరప్షన్ ప్లానర్లకు షాక్ Andhra Prbha Crime News
13-Officials-Corruption-Case : కరప్షన్ ప్లానర్లకు షాక్ Andhra Prbha Crime News
ఒంగోలు టౌన్ ప్లానింగ్ లో
13 మందిపై కేసు నమోదు
ఏకకాలంలో ఇళ్లల్లో సోదాలు
ఏసీబీ డిఎస్పి బృందం బిజీబిజీ
( ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ):

13-Officials-Corruption-Case : ఒంగోలు నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు విరుచుకుపడ్డారు. ఏకంగా 13 మంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన అధికారులు గురువారం ఉదయం ఆ 13 మంది ఇళ్లకు వెళ్లి షాక్ ఇచ్చారు. ఒంగోలు ఇన్చార్జి ఏసీబీ డిఎస్పి రామకృష్ణుడు పర్యవేక్షణలో గుంటూరు ప్రకాశం నెల్లూరు కు చెందిన అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందాలు ఒంగోలులోని ఉద్యోగుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని ఆస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. గత మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగాలపై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న టిపిఎస్ షేక్ రసూల్, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ మూల రఘురాం ప్రకాష్ రెడ్డి, కాకర్ల మణిరావు, కాసిన బోయిన ముఖేష్ కుమార్, బక్క మంతుల ప్రవీణ్ కుమార్, పుల్లేటికుర్తి తరుణ్ కుమార్, దీపావత్ రవికుమార్, బలగాని శరత్, ద్వారశీల శశినాద్ రావు రెడ్డి, కనగల లక్ష్మీ పావని, గండు శ్రీకాంత్, వల్లభుని పార్థివ్ హర్ష, దేవరపల్లి శశిధర్ లు భవన నిర్మాణ అనుమతులు లేఔట్లు క్రమబద్ధీకరణ విషయంలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అప్పట్లో ఉన్నతాధికారులకు అందించారు. రికార్డులను పూర్తిగా పరిశీలించిన అధికారులు అనుమతులు ఇవ్వడంతో అధికారులు ఈ 13 మందిపై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులపై తీవ్ర ఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్న నేపథ్యంలో వీరినే ఏసీబీ అధికారులు టార్గెట్ చేయడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది
