ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది

  • పందిరి గీతా రమేష్

చిట్యాల, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే రాజ్యాంగబద్ధమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య విద్యా కమిటీ చైర్మన్ పందిరి గీతా రమేష్ పేర్కొన్నారు.

గురువారం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల జాబితాల తయారీ, సవరణలపై ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియ స్వచ్ఛమైన, నిష్పక్షపాత ఎన్నికలకు దోహదపడుతుందని, వయోజన ఓటు హక్కుకు సంబంధించిన ఆర్టికల్ 326 స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.

తెలంగాణలో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేసి తిరిగి సేకరిస్తారని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల కానున్నట్లు చెప్పారు.

ఈ ప్రక్రియ ద్వారా నకిలీ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు తొలగించబడటంతో పాటు, 18 సంవత్సరాలు నిండిన కొత్త అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే ఓటర్ల వ్యక్తిగత వివరాల నవీకరణ కూడా జరుగుతుందని తెలిపారు.

ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేరు, చిరునామా తదితర వివరాలను నిర్ధారించుకోవాలని పందిరి గీతా రమేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి అన్యాయంగా తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత ప్రజల్లో అవగాహన కల్పించి ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వలస కార్మికులు, పేదలు, మహిళలు, వృద్ధులు ఈ ప్రక్రియలో వెనుకబడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పరిపూర్ణమైన ఓటరు జాబితా నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది అని, అవినీతి రహిత ఎన్నికలు, జవాబుదారీతనం గల పాలన, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని పందిరి గీతా రమేష్ పేర్కొన్నారు.