నిండు జీవితానికి రెండే చుక్కలు..
నిండు జీవితానికి రెండే చుక్కలు..
జూన్ 28న పల్స్ పోలియో : డీఎంహెచ్‌వో
పుట్టపర్తిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : “నిండు జీవితానికి రెండే చుక్కలు” అనే నినాదంతో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఫైరోజ్ బేగం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గణేష్ కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో ఫైరోజ్ బేగం మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ ఐదేళ్లలోపు పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకెళ్లి రెండు చుక్కల పోలియో మందు వేయించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 32 మండలాల్లో పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలతో పాటు బస్టాండ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు అందించనున్నట్లు వివరించారు.
కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమని, ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు సహకరించాలని కోరారు. ఇప్పటికే ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జూన్ 28న పోలియో చుక్కల కార్యక్రమం పూర్తైన అనంతరం లక్ష్యం 100 శాతం చేరని ప్రాంతాలను గుర్తించి, ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పూర్తి స్థాయి లక్ష్యాన్ని సాధిస్తామని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
