Hyderabad | ఇద్దరు నిందితుల అరెస్ట్.. రెండు తుపాకులు స్వాధీనం
- ఆయుధాల సరఫరాపై టాస్క్ఫోర్స్ దర్యాప్తు
Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: హైదరాబాద్లో అక్రమ ఆయుధాల తయారీ, సరఫరా చేస్తున్న ముఠాపై టాస్క్ఫోర్స్ పోలీసులు కీలక చర్య చేపట్టారు. దేశీయ తుపాకుల తయారీకి పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి రెండు దేశీయ తుపాకులు, ఏడు సజీవ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో నిందితులు దేశీయ తుపాకుల తయారీ, నిల్వ, సరఫరాలో భాగస్వాములైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆయుధాలను ఎక్కడ తయారు చేశారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు? అనే అంశాలపై టాస్క్ఫోర్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాకు ఇతర రాష్ట్రాలతో లేదా నేర ముఠాలతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
