గోదావరి కరకట్ట పనులు నాణ్యతతో పూర్తి చేయాలి..
- మంత్రి సీతక్క
ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నది కరకట్ట భద్రత కోసం నూతన సాంకేతికతతో చేపడుతున్న జియో ట్యూబ్స్ ఏర్పాటు పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (దనసరి అనసూయ) జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో కరకట్ట దెబ్బతినకుండా చేపడుతున్న రక్షణ చర్యలను మంత్రి సమీక్షించారు. సంబంధిత అధికారులను అడిగి మ్యాప్ ఆధారంగా గోదావరి నది ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, ప్రస్తుతం అమలు చేస్తున్న రక్షణ చర్యలపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జియో ట్యూబ్స్ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
