Tamil Nadu | ఇంట్లోకి దూరిన చిరుత.. గర్జనతో కలకలం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత రాత్రి వేళ కుక్కను వెంటాడుతూ నేరుగా ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లోకి వెళ్లిన చిరుత అక్కడే ఉన్న మంచం కింద దాక్కుంది.

చిరుత ఇంట్లోకి వచ్చిన విషయాన్ని గమనించిన ఇంటి యజమాని ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వెంటనే గది తలుపులు బయట నుంచి లాక్ చేసి కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించాడు. దీంతో చిరుత ఇంట్లోనే చిక్కుకుపోయింది.

బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో చిరుత ఆక్రోశంగా గర్జిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఇంట్లో మంచం కింద నుంచి గర్జిస్తున్న చిరుతను వీడియోలో చిత్రీకరించగా, ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చిరుతను సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. జనావాసాల్లోకి అడవి జంతువుల సంచారం పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీశాఖ తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.