ఎస్ఐఆర్కు సహకారం అందించాలి
గ్రామస్తులకు రామచంద్రపురం సర్పంచ్ నర్సింహులు పిలుపు
మహబూబ్నగర్ రూరల్, (ఆంధ్రప్రభ): మహబూబ్నగర్ రూరల్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వై. నర్సింహులు గ్రామస్తులకు ఎస్ఐఆర్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓటరు జాబితాను సమగ్రంగా సవరించే ప్రక్రియ చేపట్టారని, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించి, 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లకు నమోదు చేసే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సంజీవరెడ్డి, జీపీవో సైదమ్మ, బీఎల్ఓ పుష్పలత, బీఎల్ఏలు బి. వీరన్న, ఎండి సమీర్ తదితరులు పాల్గొన్నారు.
