ఉద్యాన విప్లవానికి కర్నూలు కేంద్రం
ఉద్యాన విప్లవానికి కర్నూలు కేంద్రం
లక్ష కోట్ల హార్టికల్చర్ మిషన్‌లో జిల్లాకు కీలక పాత్ర
2028 నాటికి 2 లక్షల ఎకరాల లక్ష్యం..
జొన్నగిరి సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమను వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. జొన్నగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో కర్నూలు జిల్లాలో ఉద్యాన సాగును 5 లక్షల ఎకరాలకు పెంచడం, లక్ష ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ అమలు, 246 చెరువుల పునరుద్ధరణ, రూ.40 వేల కోట్ల హార్టికల్చర్ హబ్ నిర్మాణం వంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలు నిర్దేశించబడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు ఆదాయం పెంపే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ ప్రణాళిక కర్నూలు జిల్లా వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాయలసీమ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఉద్యాన విప్లవానికి కర్నూలు జిల్లాను కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. జొన్నగిరిలో జిల్లా అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యాన సాగు విస్తరణ, మైక్రో ఇరిగేషన్, నీటి సంరక్షణ, రైతుల ఆదాయ పెంపుపై స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న రూ.1 లక్ష కోట్ల హార్టికల్చర్ మిషన్‌లో కర్నూలు జిల్లా కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ప్రస్తుతం 2.90 లక్షల ఎకరాలు.. లక్ష్యం 5 లక్షల ఎకరాలు
ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సుమారు 1.17 లక్షల హెక్టార్లు (దాదాపు 2.90 లక్షల ఎకరాలు) ఉద్యాన పంటల సాగులో ఉన్నాయి. ఇందులో మామిడి, బత్తాయి, దానిమ్మ, జామ, అరటి, ఉల్లి, మిరప, టమాటా తదితర పంటలు ఉన్నాయి. అయితే రాయలసీమ హార్టికల్చర్ హబ్ లక్ష్యానికి అనుగుణంగా రానున్న నాలుగైదేళ్లలో ఉద్యాన సాగును ఐదు లక్షల ఎకరాలకు పెంచే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా పత్తికొండ, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోసిగి, తుగ్గలి, దేవనకొండ ప్రాంతాల్లో ఉద్యాన విస్తరణకు విస్తార అవకాశాలు ఉన్నాయని సమీక్షలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
పత్తికొండకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్
పత్తికొండ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉద్యాన సాగు రాష్ట్ర సగటుతో పోలిస్తే తక్కువగా ఉందని సీఎం గుర్తించారు. ఈ ప్రాంతంలో కనీసం 50 వేల నుంచి 75 వేల ఎకరాల వరకు కొత్త ఉద్యాన తోటల అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.మామిడి, జామ, దానిమ్మ, బత్తాయి, సీతాఫలం వంటి శాశ్వత పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు.

డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యం 1 లక్ష ఎకరాలు
కర్నూలు జిల్లాలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు మైక్రో ఇరిగేషన్‌ను మరింత విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు.ప్రస్తుతం ఉన్న డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలను విస్తరించి రానున్న మూడేళ్లలో అదనంగా 1 లక్ష ఎకరాలను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తీసుకురావాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.డ్రిప్ ద్వారా 40 శాతం వరకు నీటి పొదుపుతో పాటు దిగుబడి 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ఉల్లి సాగుకు కొత్త వ్యూహం
కర్నూలు జిల్లా ఉల్లి సాగులో రాష్ట్రంలోనే ప్రధాన ప్రాంతంగా గుర్తింపు పొందింది. జిల్లాలో ఏటా 45 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు ఉల్లి సాగు జరుగుతోంది. అయితే ధరల హెచ్చుతగ్గులు, విత్తనాల నాణ్యత సమస్యలతో రైతులు నష్టపోతున్న నేపథ్యంలో అధిక దిగుబడి వంగడాలు, నిల్వ గోదాములు, శాస్త్రీయ సాగు పద్ధతులను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఉల్లి సాగులో ఎకరాకు దిగుబడిని ప్రస్తుతం ఉన్న 8-10 టన్నుల నుంచి 12-15 టన్నులకు పెంచే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని వ్యవసాయ శాఖకు సూచించినట్లు సమాచారం.
246 చెరువులు.. 6 నెలల్లో పూర్తి
ఉద్యాన సాగుకు నీటి భద్రత కల్పించేందుకు జలధార-జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎం అధికార వర్గాలకు ఆదేశించడం గమనార్హం. జిల్లాలో చేపట్టిన 246 చెరువుల పునరుద్ధరణ పనులను ఈ సీజన్ ముగిసేలోగా పూర్తి చేయాలని కూడా సూచించారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులకు అవసరమైన రూ.100 కోట్ల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేయడం జరిగింది.
భూగర్భ జలాలపై ప్రత్యేక ఫోకస్
ప్రస్తుతం జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాల మట్టం క్షీణిస్తున్న నేపథ్యంలో వాటిని కనీసం 3 మీటర్ల మేర పెంచే లక్ష్యంతో చెక్‌డ్యామ్‌లు, పర్కొలేషన్ ట్యాంకులు, కాంటూర్ ట్రెంచ్‌లు నిర్మించాలని సూచించారు.ప్రత్యేకించి కోసిగి, ఆలూరు, మంత్రాలయం, ఆస్పరి ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రూ.40 వేల కోట్ల హార్టికల్చర్ హబ్
రాయలసీమను దేశంలోనే అతిపెద్ద ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో “పూర్వోదయ హార్టికల్చర్ ప్రాజెక్ట్” రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా కర్నూలు జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు, ప్యాక్ హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,ఎగుమతి కేంద్రాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
రైతు ఆదాయం రెట్టింపు లక్ష్యం
ఉద్యాన పంటల ద్వారా సంప్రదాయ పంటల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఆదాయం సాధ్యమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఎకరాకు సగటున రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం వస్తుండగా, ఉద్యాన పంటల ద్వారా దానిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
