Osmania Hospital | తాగునీరు, వైద్య పరికరాల కొరతతో రోగుల అవస్థలు

Osmania Hospital | తాగునీరు, వైద్య పరికరాల కొరతతో రోగుల అవస్థలు

Osmania Hospital | అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాల బకాయిలు
టిమ్స్‌కు డిప్యూటేషన్‌లపై వైద్యసేవల భవిష్యత్తుపై ఆందోళన
అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలకు రంగం సిద్ధం

Osmania Hospital | హైదరాబాద్, ఆంధ్రప్రభ : వైద్యసేవల్లో తెలంగాణకే తలమానికంగా నిలిచిన ఉస్మానియా ఆసుపత్రి నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు అత్యుత్తమ వైద్యసేవలు అందించే ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది.

ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు, సదుపాయాల సంగతి ఎలా ఉన్నా రోగులకు, వారి సహాయకులకు కనీసం తాగునీటి సరఫరా కూడా లేకపోవడంతో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగులకు అవసరమైన డయాగ్నస్టిక్, సిటీ స్కానింగ్ తదితర రోగనిర్ధారణ పరీక్షలకు అవసరమైన యంత్రాలు లేకపోవడంతో ప్రైవేటులో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ప్రైవేటులో ఈ పరీక్షలు చేయించుకోలేని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇన్‌పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరిన వారికి నీటి కొరత కారణంగా నానా అవస్థలు ఎదురవుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్న బోరులో నీటి లభ్యత లేకపోవడంతో రోగుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉండగా ఉస్మానియాలో పని చేస్తున్న కొంతమంది వైద్యులు, సిబ్బందిని సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రికి డిప్యూటేషన్ చేయడంతో రోగులకు రానున్న రోజుల్లో పూర్తిస్థాయి వైద్యసేవలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారం రోజులుగా ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి పరిధిలో నాలుగు అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, పారిశుద్ధ్యం, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, వివిధ సాంకేతిక విభాగాల్లో 217 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వారం క్రితమే ఆందోళనకు దిగిన ఉద్యోగులు తమకు ఏజెన్సీల నుంచి వేతన బకాయిలు ఇప్పించాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేష్ సహాయ్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం స్థానిక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

అదేవిధంగా మానవహక్కుల వేదిక బృందం ఇటీవల ఆసుపత్రిని సందర్శించి అక్కడ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకుంది. ఈ పరిస్థితులన్నింటిపై సీఎం విచారణకు ఆదేశించిన క్రమంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో మాట్లాడిన ఉస్మానియా వైద్యాధికారుల బృందం ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు ఉద్వాసన!

ఉద్యోగుల పేరిట అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకుల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం అన్ని వివరాలను సేకరించినట్లు సమాచారం. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీలు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి అలవెన్సుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.