రోడ్డు ప్రమాదంలో మరణించింది కానీ..
రోడ్డు ప్రమాదంలో మరణించింది కానీ..
హన్మకొండ క్రైమ్, ఆంధ్రప్రభ : ధర్మసాగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మరణించింది కానీ.. ఆమె ఎవరు అనేది వివరాలు లేవు. అందుకనే.. సుమారు 55 సంవత్సరాల వయసు ఉంటుందని.. మరణించిన ఈ మహిళను ఎవరైనా గుర్తిస్తే వివరాలు తెలపాలని ధర్మసాగర్ సి. ఐ.శ్రీధర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత సోమవారం రోజున రాత్రి 8 గంటల సమయంలో, రాంపూర్ గ్రామ శివారులో గల రంగసముద్రం చెరువు సమీపంలోని ఎన్. హెచ్.163 రోడ్డు పై ములుగు వైపు నుండి స్టేషన్ ఘనపూర్ వైపు వెళ్లే మార్గంలో ఒక గుర్తుతెలియని వాహనం సదరు మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం అనంతరం సదరు వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు, 108 సిబ్బంది చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మంగళవారం రాత్రి మరణించింది.
ప్రస్తుతం మృతదేహం యం. జి. యం.ఆసుపత్రి మార్చురీలో భద్రపరచారు. ఆమె ఎత్తు 5.5 అడుగులు, ఆకుపచ్చ రంగు చీర (దానిపై తెలుపు, ఆరెంజ్ రంగు గీతలు ఉన్నాయి) లేత ఆకుపచ్చ రంగు బ్లౌజ్ ధరించి ఉన్నదని ఆమె వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే క్రింది నంబర్లలో 87126 85010, 8712675127 ధర్మసాగర్ పోలీసులను సంప్రదించాల్సిందిగా కోరారు.
