Tungabhadra Water Share | తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ ఫోకస్..

  • తెలంగాణ వాటా నీటి కోసం కేంద్ర జోక్యం కోరిన ప్రభుత్వం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తుంగభద్ర డ్యామ్‌ నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగం, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై జలసౌధలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్‌, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం ఐదు నుంచి ఆరు టీఎంసీలకు మించి అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలోని దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉందన్నారు.

మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్న తుంగభద్ర జలాల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్డీఎస్ భద్రతపై ఆందోళన.. పెండింగ్ పనులపై సీఎం ఆగ్రహం

ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకర పరిస్థితిలో ఉందని, భద్రతా పరంగా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజోలిబండ డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ పనులు పూర్తికాలేదని సమీక్షలో ప్రస్తావించారు.

అధికారులు వివరించిన ప్రకారం ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్యాకేజీ-3, ప్యాకేజీ-4 పనులు మాత్రం పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న మొదటి రెండు ప్యాకేజీల పనులను వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరగనున్న సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు.

పూడికతో నీటి మళ్లింపుకు ఆటంకం..

కేంద్రం, కర్ణాటక సహకారం కోరనున్న తెలంగాణ

ఆర్డీఎస్ వద్ద తెలంగాణ భూభాగం వైపు భారీగా పూడిక పేరుకుపోవడంతో ఆశించిన స్థాయిలో నీటి మళ్లింపు జరగడం లేదని ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు. 2004లో నిపుణుల కమిటీ పూడిక తొలగించాలని సిఫారసు చేసినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని సమావేశంలో చర్చించారు.

పూడిక తొలగింపు చర్యలను తక్షణమే చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూడిక పేరుకున్న ప్రాంతం కర్ణాటక భూభాగంలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే 2004 నిపుణుల కమిటీ సూచనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్రానికి వినతిపత్రం సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అప్పటి నివేదికను ప్రస్తుత పరిస్థితులతో పోల్చి సమగ్ర విశ్లేషణ చేసి వెంటనే నివేదిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.

తుంగభద్ర ఎత్తిపోతలపై ప్రత్యామ్నాయాల పరిశీలన..

తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తుమ్మిళ్ల నుంచి నీటిని సమర్థంగా వినియోగించేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని, అందుకు అవసరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

తెలంగాణకు రావాల్సిన పూర్తి నీటి వాటా సాధన, ఆర్డీఎస్ పునరుద్ధరణ, సాగునీటి వినియోగం పెంపు కోసం కేంద్రంతో పాటు భాగస్వామ్య రాష్ట్రాల సహకారం తీసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమావేశంలో స్పష్టమైంది.