మోదీ 12 ఏళ్ల సుపరిపాలనను ఇంటింటికీ చేరుస్తాం

చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, ఆయన 12 ఏళ్ల సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు.బుధవారం చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విశేష జనసంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన పుస్తకాలను ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల్లో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, మౌలిక వసతుల కల్పనలో మోదీ ప్రభుత్వం విశేష కృషి చేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయడంలో బీజేపీ కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల రాజు, మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్, రాయిని శ్రీనివాస్, ర్యాకం శ్రావణ్, వల్లల ప్రవణ్, గుండ మణికుమార్, రాకేష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.