డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పునరంకితం కావాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టేస్తుందని అన్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్‌పై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు తల్లిదండ్రులు, యువతలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

అనంతరం హాజరైన వారందరితో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకోగా, విజేతలను సీఐ అభినందించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, కౌన్సిలర్లు ఎండి హన్ను, పాక చిరంజీవి, ఎస్సై కనకటి యాదగిరి, అంగన్‌వాడీ టీచర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.