ఆదర్శ పాఠశాల వసతులపై డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి సమీక్ష

కుంటాల, ఆంధ్రప్రభ: ఆదర్శ పాఠశాలలో ఇటీవల నెలకొన్న విద్యుత్ సమస్యల నేపథ్యంలో జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి బుధవారం పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజును అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌తో పాటు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిధులు మంజూరు చేయడంతో చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ఆమె సూచించారు. రాబోయే రోజుల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను కూడా ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం పాఠశాల పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ, పలు రికార్డులను పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేలా ఉపాధ్యాయ సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.