కార్పొరేట్ స్థాయి విద్య లక్ష్యంగా ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన బోధన
కుంటాల, ఆంధ్రప్రభ: కార్పొరేట్ స్థాయి విద్యార్థులకు అందే విధంగా నాణ్యమైన విద్యను ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో అందించడమే లక్ష్యమని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న అన్నారు. బుధవారం కుంటాల ఆదర్శ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో విద్యుత్ సమస్య ఉన్న విషయాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.
విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పదో తరగతి తరగతి గదిని సందర్శించిన జిల్లా విద్యాధికారి విద్యార్థులకు పాఠాలు బోధించి, ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, చదువే భవిష్యత్తుకు బలమైన పునాదని సూచించారు.
తదుపరి పాఠశాల రికార్డులను తనిఖీ చేసిన ఆయన, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశించారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఏత్రాజ్ రాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
