ప్రజల మధ్య ఉండేవాడే నిజమైన నాయకుడు
నూతన అధ్యక్షులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సూచన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: నాయకుడు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, గౌరవించినప్పుడే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
చౌటుప్పల్ పట్టణంలోని ఆయన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎంపికైన చౌటుప్పల్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, చౌటుప్పల్ పట్టణ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డిల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఇరువురినీ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్య నిరంతరం ఉంటూ వారి ఆపదల్లో అండగా నిలవాలని పార్టీ నాయకులకు సూచించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను ఎప్పుడూ రాజీపడలేదని, భవిష్యత్తులో కూడా రాజీపడనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఓర్పుతో పనిచేసే వారికి తప్పకుండా అవకాశాలు, పదవులు వస్తాయని అన్నారు.
గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో మార్పు వస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల పట్ల బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలగ రాజశేఖర్ రెడ్డి, సర్పంచులు జువ్వి నరసింహ, మర్రి వంశీధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
