నగరనికే తలమానికంగా కూరగాయల హోల్‌సేల్ మార్కెట్..

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్రప్రభ : నగరానికే తలమానికంగా దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వెజిటబుల్స్ హోల్‌సేల్ మార్కెట్ను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విజయవాడ హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ రాష్ట్రానికే తలమానికంగా నిలిచే స్థాయికి ఎదుగుతోందన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆధునిక సౌకర్యాలతో కూడిన హోల్‌సేల్ మార్కెట్ అవసరం ఏర్పడగా, మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కలిసి సొంత స్థలం కొనుగోలు చేసి తమ స్వంత నిధులతో ఈ మార్కెట్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ రాష్ట్రంలోనే ప్రధాన హోల్‌సేల్ కూరగాయల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 15 లక్షల మంది ప్రజలకు అవసరమైన కూరగాయల సరఫరాకు ఇది కీలక కేంద్రంగా మారుతుందన్నారు.