జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుతో అభివృద్ధికి కొత్త దిశ : జియో మైసూర్ ఎండీ జి. ప్రభాకరన్
ఇన్‌క్లూజివ్ మైనింగ్‌తో సమగ్రాభివృద్ధి లక్ష్యం.. పరిసర గ్రామాలను మోడల్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతాం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కర్నూలు జిల్లాలో స్వర్ణయుగం ప్రారంభమైందని జియో మైసూర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి. ప్రభాకరన్ పేర్కొన్నారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కేవలం బంగారం ఉత్పత్తికే పరిమితం కాకుండా మొత్తం ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడే అభివృద్ధి కేంద్రంగా మారనుందని అన్నారు.
జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు ప్రాంతంలో 800 మీటర్ల లోతు వరకు బంగారు ఖనిజ నిక్షేపాలు గుర్తించినట్లు ప్రభాకరన్ వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, అంతర్జాతీయ స్థాయి పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జిల్లా అభివృద్ధికి గోల్డ్ ప్రాజెక్టు దోహదం
ఈ ప్రాజెక్టు ద్వారా జొన్నగిరి పరిసర గ్రామాలతో పాటు మొత్తం కర్నూలు జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
భారతదేశం ఇప్పటివరకు విదేశాల నుంచి భారీగా బంగారం దిగుమతి చేసుకుంటోందని, జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే భవిష్యత్తులో బంగారం ఎగుమతి చేసే స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఇన్‌క్లూజివ్ మైనింగ్‌తో ఇన్‌క్లూజివ్ గ్రోత్
గనుల అభివృద్ధి ఫలాలు స్థానిక ప్రజలకు అందే విధంగా ‘ఇన్‌క్లూజివ్ మైనింగ్ – ఇన్‌క్లూజివ్ గ్రోత్’ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభాకరన్ వివరించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని వెల్లడించారు.
విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
ఖనిజ సంపదతో ఏపీకి అపార అవకాశాలు
విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో విమానాల తయారీలో వినియోగించే టైటానియం, అరుదైన ఖనిజాలు, ఉత్తరాంధ్రలో బాక్సైట్ వంటి విలువైన సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని ప్రభాకరన్ తెలిపారు. ఈ ఖనిజ సంపదను శాస్త్రీయంగా, సమర్థవంతంగా వినియోగించగలిగితే రాష్ట్రం వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించగలదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న ప్రోత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
