మున్సిపల్ కార్మికులకు రూ.34 వేల కనీస వేతనం ఇవ్వాలి
రెగ్యులర్ ఉద్యోగాలు, గ్రాట్యుటీ కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా
చిత్తూరు, ఆంధ్రప్రభ : మున్సిపల్ పారిశుధ్య కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం నెలకు రూ. 34 వేలు మంజూరు చేయాలని, పదవీ విరమణ అనంతరం రూ. 5 లక్షల గ్రాట్యుటీతో పాటు పూర్తి రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జూలై 7న చేపట్టనున్న “చలో విజయవాడ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కోదండయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.నాగరాజు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పలు దఫాల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 20న మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు, జూన్ 22న ఎమ్మెల్యేలకు వినతిపత్రాల సమర్పణ అనంతరం బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టినట్లు వివరించారు.
ఎన్నికల సమయంలో పారిశుధ్య కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మారుస్తామని ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను కొనసాగించడంతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు 12వ వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని, మున్సిపల్ పారిశుధ్య సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకుంటామని నాయకులు హెచ్చరించారు. విధుల్లో మరణించిన లేదా పదవీ విరమణ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పారిశుధ్య కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.34 వేలకు పెంచాలని, పదవీ విరమణ పొందే కార్మికులకు రూ.5 లక్షల గ్రాట్యుటీతో పాటు పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కోదండయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.నాగరాజు, జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, నాయకులు కె.మణి, సుబ్రహ్మణ్యం, వాసు, వినాయక, సురేష్, సుగుణ, చినరాజు, ఏసుదాస్, కుట్టి ఎల్లమ్మ, ఈశ్వరన్, చిత్ర, రామనాథం, భాగ్యలక్ష్మి, సామేలు, సుకన్య తదితరులతో పాటు చిత్తూరు కార్పొరేషన్, నగరి, పలమనేరు మున్సిపాలిటీలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
