Love Protest | విడుదల చేయకపోతే…

Love Protest | విడుదల చేయకపోతే…

Love Protest | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ఓ యువతి చేసిన హైడ్రామా స్థానికంగా కలకలం రేపింది. తన ప్రియుడిని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఏకంగా వంద అడుగుల ఎత్తైన సెల్ టవర్ ఎక్కింది. ప్రియుడిని విడుదల చేసి తమ పెళ్లి జరిపించాలని, లేదంటే టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 18న ఓ యువతి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతితో కలిసి వెళ్లిన యువకుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే తాను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, స్వచ్ఛందంగానే ప్రియుడితో వెళ్లానని యువతి పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రియుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె సెల్ టవర్ ఎక్కింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని యువతిని కిందకు దిగాలని పలుమార్లు కోరారు. అయితే ఆమె మాత్రం తన డిమాండ్ నెరవేర్చే వరకు దిగనని మొండికేసింది.

దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిన ఉత్కంఠభరిత పరిణామాల అనంతరం అధికారులు యువతితో చర్చలు జరిపి ఆమెను శాంతింపజేశారు. చివరకు సురక్షితంగా కిందకు దించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువతి చేసిన చర్యపై పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే యువకుడి అరెస్టుకు సంబంధించిన కేసుపైనా దర్యాప్తు కొనసాగుతోంది.