AP Investments | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు

AP Investments | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు

AP Investments | పెట్టుబడుల పండుగకు తెరలేపిన కేబినెట్
రాయలసీమలో పునరుత్పాదక ఇంధన శక్తి విప్లవం
విశాఖ నుంచి తిరుపతి వరకు పర్యాటక రంగానికి ఊతం
డేటా సెంటర్లు, గురుకుల పాఠశాలలకు ప్రాధాన్యం

AP Investments | అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు, అమరావతి రాజధాని నిర్మాణానికి వేగం, పరిశ్రమల విస్తరణ, పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమానికి కీలక నిర్ణయాలతో రాష్ట్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు 80కిపైగా అజెండా అంశాలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక అడుగులు వేసింది. ముఖ్యంగా రూ.34 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ద్వారా సుమారు 35 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. కేబినెట్ అజెండాలోని అంశాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

H2: పెట్టుబడుల పండుగకు తెరలేపిన కేబినెట్

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేబినెట్ నిర్ణయాలు స్పష్టం చేశాయి. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపిబి) సిఫార్సు చేసిన అనేక మెగా ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, తయారీ రంగం, ఐటీ, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ, ఏరోస్పేస్, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో మొత్తం రూ.34 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా 35 వేలకుపైగా ఉద్యోగాలు లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరోక్ష ఉపాధి అవకాశాలు దీనికి అనేక రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

కేబినెట్ ఆమోదించిన పరిశ్రమల ప్రాజెక్టుల్లో కొన్ని రాష్ట్ర ఉపాధి రంగానికి మైలురాయిగా నిలవనున్నాయి. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న ఇన్ఫినిక్స్ ఐటీ క్యాంపస్ ద్వారా నాలుగు వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాయలసీమలో ఏర్పాటు కానున్న రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్ మూడు వేల మందికి ఉపాధి కల్పించనుంది. శ్యామ్ మెటాలిక్స్ స్టీల్ కాంప్లెక్స్ ద్వారా 3,200 ఉద్యోగాలు రానున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ప్రాజెక్టులు మరో 3,040 మందికి ఉపాధి కల్పించనున్నాయి.

పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఐసీఎన్ఎక్స్ ఇండియా ఆటోమోటివ్ కెమెరా మాడ్యూల్స్ యూనిట్ ద్వారా 1,633 ఉద్యోగాలు, జెట్ఫ్యాబ్ పీసీబీ తయారీ యూనిట్ ద్వారా 1,049 ఉద్యోగాలు రానున్నాయి. బాల్ బెవరేజెస్, యాక్షన్ టెసా తదితర సంస్థల ప్రాజెక్టుల ద్వారా మరో 1,500 మందికి ఉపాధి లభించనుంది.

H2: అమరావతికి మళ్లీ వేగం

రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలో ట్రంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.426.46 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా పిచ్చుకలపాలెంలో ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.130.38 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరు చేసింది.

అమరావతి మౌలిక వసతుల పనులకు సంబంధించిన మూడు ప్రధాన ప్యాకేజీల టెండర్లను కూడా ఆమోదించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మొదటి, రెండో దశల అమలు కోసం సీఆర్డీఏలో 95 తాత్కాలిక పోస్టులను సృష్టించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. దీంతో భూసమీకరణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.

రాజధాని ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, వ్యాపార కార్యక్రమాలు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐదు నక్షత్రాల హోటళ్లకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. అకార్ బ్రాండ్ కింద ఐదు నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్, క్రౌన్ ప్లాజా-హాలిడే ఇన్ ట్విన్ హోటల్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో అమరావతి అంతర్జాతీయ వ్యాపార మరియు సమావేశాల గమ్యస్థానంగా ఎదగనున్నదని అధికారులు భావిస్తున్నారు.

H2: రాయలసీమలో పునరుత్పాదక ఇంధన శక్తి విప్లవం

అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ స్థాయిలో సోలార్, విండ్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపును కేబినెట్ ఆమోదించింది. కడప జిల్లాలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, 126 మెగావాట్ల విండ్ ప్రాజెక్టులు, శ్రీ సత్యసాయి జిల్లాలో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, అనంతపురం జిల్లాలో 1,200 మెగావాట్ల భారీ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నంద్యాల జిల్లా యాగంటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1,000 మెగావాట్ల నుంచి 1,500 మెగావాట్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది.

H2: విశాఖ నుంచి తిరుపతి వరకు పర్యాటక విప్లవం

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. విశాఖపట్నంలో ఇకో వెల్నెస్ రిసార్ట్, అస్కాట్ హోటల్, ప్రమోద్ హోటల్స్ లగ్జరీ ప్రాజెక్టులు, మైరా బేవ్యూ రిసార్ట్లకు అనుమతులు మంజూరయ్యాయి.

అన్నవరం సమీపంలో క్లబ్ మహీంద్రా రిసార్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. తిరుపతిలో డైవిక్ హోటల్, ఒబెరాయ్ విలాస్ రిసార్ట్, కర్నూలులో మారియట్ బ్రాండ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ టూరిజం పార్క్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ వద్ద ఐదు నక్షత్రాల కోస్టల్ రిసార్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆమోదం పొందాయి.

H2: డేటా సెంటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం

భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతి, విశాఖపట్నంను దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడుల వల్ల వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

వెనుకబడిన తరగతుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 10 కొత్త ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి.

మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధులను క్రమబద్ధీకరించడం ద్వారా పెట్టుబడులకు మరింత స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు సాంకేతిక ఆధారిత సేవలు అందించనుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కలిగిన బస్సులపై త్రైమాసిక పన్నును సీటుకు రూ.4,000 నుంచి రూ.2,500కు తగ్గిస్తూ పర్యాటక రంగానికి ఊరట కల్పించింది.