ఓటర్ల జాబితా సవరణపై బిఎల్ఓలకు అవగాహన సదస్సు
నర్సంపేట, ఆంధ్రప్రభ ప్రతినిధి : భారత ఎన్నికల సంఘం చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026 (ఎస్ఐఆర్) ప్రక్రియ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలోని 283 మంది బూత్ లెవెల్ ఏజెంట్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటికే నిర్వహించిన మొదటి, రెండో విడత ఓటర్ల జాబితా సవరణల్లో అనేక మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించబడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
తెలంగాణలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పీసీసీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలకు ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితానే ప్రామాణికంగా మారనున్నందున ప్రతి బీఎల్ఏ అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరు పేరును జాబితాలో నమోదు చేయడం, తొలగింపులు జరగకుండా పర్యవేక్షించడం, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం బీఎల్ఏల బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పులి అనిల్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, బీఎల్ఏల విధులు, ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ హరీశ్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్వతమ్మ, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాకూబ్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సాంబయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
