వక్ఫ్ ఆస్తుల కేటాయింపుపై వైసీపీ ఆగ్రహం
మంత్రి ఫరూక్ రాజీనామా చేయాలని డిమాండ్..
ముస్లిం మైనార్టీలు సంఘటితం కావాలని పిలుపు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లాలో వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముస్లిం మైనార్టీల పవిత్ర వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ మైనారిటీ నేతలు విమర్శలు గుప్పించారు.
స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మా బున్నీసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మాజీ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు సలాముల్లా, గన్నీ కరీం, ఎం. గౌస్, జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ దేవనగర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కౌలూరు గ్రామ ఈద్గా పరిధిలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న 10 ఎకరాల భూమిని కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, వాటిని ఇతర అవసరాలకు కేటాయించడం ముస్లిం సమాజానికి అన్యాయం చేయడమేనని విమర్శించారు.
అల్లా పేరిట అంకితం చేసిన భూములను ముస్లింల మతపరమైన, సామాజిక అవసరాల కోసమే వినియోగించాలని, వాటిని బదలాయించడం లేదా ఇతర అవసరాలకు వినియోగించడం సరికాదని పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో విఫలమైన మంత్రి ఫరూక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూనెపల్లి జామియా మసీదు ఆస్తులను పరిరక్షించామని, ప్రస్తుతం చాబోలు గ్రామ సమీపంలో వక్ఫ్ బోర్డుకు చెందిన 19.14 ఎకరాల భూమిని పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అవసరాలకు కేటాయించడం దురదృష్టకరమని అన్నారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం జిల్లాలోని ముస్లిం మైనార్టీలంతా సంఘటితం కావాలని, ఈ అంశంపై చట్టపరంగా, సామాజికంగా పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
