శ్రీశైలంలో సిబ్బంది సమయపాలనను పాటించలి..
భక్తులతో మర్యాదగా మెలగాలి..
ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఆకస్మిక తనిఖీ.
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు.
దేవస్థానం కల్యాణకట్టను పరిశీలించిన ఆయన, అక్కడి కౌంటర్ల పనితీరును తనిఖీ చేశారు. కల్యాణకట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, శుచీశుభ్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా కల్యాణకట్టను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సూచించారు.
సిబ్బంది అందరూ సమయపాలనను ఖచ్చితంగా పాటించాలని, కేశఖండన కోసం వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని క్షురకులు, కౌంటర్ సిబ్బందికి సూచించారు.
కల్యాణకట్టలో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు సక్రమంగా పనిచేసేలా సంబంధిత సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాటి పనితీరును తరచూ పరిశీలించాలని ఆదేశించారు. అలాగే సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించాలని సూచించారు.
అనంతరం కల్యాణకట్ట వద్ద భక్తులతో ముఖాముఖిగా మాట్లాడిన చైర్మన్, దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దేవస్థానం అందిస్తున్న సేవలు, సౌకర్యాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
