కుండపోత వర్షం…
ఉరుములు మెరుపులతో కూడిన బీభత్సవం..
పిడుగుపాటుకు20 గొర్రెలు ఎనిమిది ఆవులు మృత్యువాత..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఆగమనంతో పాటు వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర నష్టం సంభవించింది. అవుకు మండలం అన్నవరం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు 8 ఆవులు మృతి చెందగా, సంజామల మండల పరిధిలోని ముదిగేడు గ్రామంలో 20 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి చెందిన ఆవులు మేపు కోసం అన్నవరం గ్రామానికి వచ్చిన సమయంలో పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు సమాచారం.
అదేవిధంగా జూనూతల గ్రామానికి చెందిన సుబ్బయ్యకు చెందిన పశువులు కూడా పిడుగుపాటుకు మృతి చెందాయి. జీవనాధారమైన పశువులు కోల్పోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటన స్థలాలను పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా దాదాపు 24 గంటలపాటు నిలిచిపోయింది. గడివేముల, రుద్రవరం, ఆళ్లగడ్డ, సిరివెళ్ల మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మహానంది, ఆత్మకూరు, ప్యాపిలి, ఆళ్లగడ్డ, రుద్రవరం ప్రాంతాల్లో పెద్దఎత్తున అరటి తోటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, నూనెపల్లె ప్రాంతాల్లో దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షాలు కూలిపోయాయి. నంద్యాల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న భారీ వృక్షం నేలకూలడంతో దాని కింద ఉన్న మూడు కార్లు ధ్వంసమయ్యాయి.
మున్సిపల్ కార్యాలయం పరిసరాలు, సలీంనగర్, హనీఫ్నగర్, దేవనగర్, సంజీవనగర్, ఎన్జీవోస్ కాలనీ ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. సంజీవనగర్లో రహదారి ఎత్తు పెరగడంతో నీరు నిల్వ ఉండి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో ఒక్కరోజే 257.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీశైలం, ఆత్మకూరు, రుద్రవరం, పాములపాడు, సిరివెళ్ల, అహోబిలం ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పిడుగుపాటుకు మృతి చెందిన పశువుల యజమానులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
