ఎంసెట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఎంసెట్-2026లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆదివారం వనపర్తిలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నారు.

ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి వెరిఫికేషన్ కేంద్రానికి చేరుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్‌ఎస్‌సీ మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, లోకల్ సర్టిఫికెట్ తదితర ఒరిజినల్ పత్రాలను సమర్పించి ధ్రువీకరణ చేయించుకున్నారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ ప్రతులను కూడా వెంట తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నెల 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుండగా, విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాంకేతిక విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.