Godavari Pushkaralu 2027 | 10 కోట్ల మంది యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు

Godavari Pushkaralu 2027 | 10 కోట్ల మంది యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు

Godavari Pushkaralu 2027 | పుష్కర ఘాట్ల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు
5 వేల భజన మందిరాల నిర్మాణానికి ప్లాన్
గోదావరి పుష్కరాలకు టీటీడీ మహా ప్రణాళిక

Godavari Pushkaralu 2027 | అమరావతి, ఆంధ్రప్రభ: వచ్చే ఏడాది జూన్‌లో అత్యంత వైభవంగా జరగనున్న గోదావరి పుష్కరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సనాతన ధర్మ ప్రచారం, భక్తులకు వసతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని టీటీడీ యోచిస్తోంది.

పుష్కర ఘాట్ల వద్ద వేద పారాయణం, హారతులు, భక్తి సంగీత కార్యక్రమాలను టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గోదావరి పుష్కర ప్రాంతాలను సందర్శించి ఎక్కడెక్కడ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలో ఒక ప్రణాళికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.

పుష్కరాలు జరిగే పరివాహక ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను, పుష్కర ఘాట్లను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులను కేటాయించింది. టీటీడీ కూడా స్థానిక ఆలయాల సమగ్ర అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను అందించనుంది. సనాతన ధర్మ వ్యాప్తి కోసం శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా సుమారు 5 వేల భజన మందిరాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ తరహాలో ప్రసాదాలు, అన్నదానం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

తిరుపతిలో మాదిరిగా పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నదాన ప్రసాదాలను అందించేందుకు తరిగొండ వెంగమాంబ సత్రంలోని సిబ్బందిని కొంతమందిని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారు. టీటీడీ వైదిక పండితులు, ఆస్థాన సిద్ధాంతులు అందించిన ముహూర్తాలను అనుసరించి పుష్కర తేదీలను జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, స్నాన ఘాట్ల వద్ద టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు మార్గదర్శకంగా ఉంటారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి రాజమండ్రిని మెగా సిటీగా తీర్చిదిద్దుతోంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆలయాలను అభివృద్ధి చేయడం వంటి బృహత్తర కార్యక్రమాలు చేపడుతుండగా, టీటీడీ ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా తన ప్రణాళికలను అమలు చేస్తోంది.

5 వేల భజన మందిరాల నిర్మాణానికి ప్లాన్

ముందు ఎన్నడూ లేని విధంగా వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాల నాటికి 5 వేల భజన మందిరాలను నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం సహా 14 శాఖలు సమన్వయంతో పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ కూడా ప్రత్యేకంగా భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

పుష్కరాలకు వచ్చే భక్తులకు తిరుమలలో అందించే తరహాలోనే అన్నదానం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్య ఏర్పాట్లను టీటీడీ పర్యవేక్షించేలా ఒక మహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈసారి భక్తులు స్నానమాచరించే పుష్కర ఘాట్లు కూడా భక్తి భావన ఉట్టిపడేలా ప్రత్యేకంగా నిర్మించాలని టీటీడీ ఒక బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేసింది.

ఇప్పటివరకు 200కు పైగా పవిత్ర ఘాట్లను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేలా దృష్టి పెట్టారు. మరికొన్ని ఘాట్లను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గుర్తిస్తున్నారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ బడ్జెట్‌తో రోడ్ల నిర్మాణం, ఘాట్ల సుందరీకరణ, రవాణా, పర్యాటక అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోంది.

10 కోట్ల మంది యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు

10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు ఏడాది ముందుగానే ప్రారంభించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు, బస్సులు, విస్తృతమైన పార్కింగ్ ప్రదేశాలు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా టీటీడీ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేయబోతున్నారు.