సర్కార్ కాలేజీల్లో సీట్లు ఫుల్…
- ప్రభుత్వ కాలేజీలకు పెరిగిన క్రేజ్
- ప్రైవేటుకు దీటుగా అడ్మిషన్ల జోరు!
- 149 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 50% సీట్లు భర్తీ
- 100కుపైగా కంపెనీలతో ఒప్పందాలు.. ప్రభుత్వ కాలేజీలకు ఊపు
- ప్రభుత్వ కాలేజీల్లో ఉద్యోగ హామీ కోర్సులు..
- రోబోటిక్స్, సెమీకండక్టర్స్ కోర్సులకు భారీ డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేవలం డిగ్రీ పట్టా ఇస్తే సరిపోదు, చదువు పూర్తి కాగానే చేతిలో ఉద్యోగం పట్టా ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. నూతన విద్యా విధానాన్ని ఉపాధి దిశగా మలిచిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలతో జతకట్టడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ కళాశాలల పట్ల నమ్మకం పెరిగింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు అడ్మిషన్ల జోరు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 149 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తొలి దశలోనే 49.6 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే రెండో విడతలో 37 శాతం అదనపు కేటాయింపులు జరిగాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో సైతం 93 శాతానికి పైగా అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రైవేటు కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీల వైపే విద్యార్థులు ఆసక్తి చూపడం విద్యారంగంలో మారుతున్న ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది.
దిగ్గజ సంస్థలతో విద్యాశాఖ దోస్తీ…
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ సుమారు 100కు పైగా అగ్రశ్రేణి సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐఐటీ హైదరాబాద్, ఐఎస్బీ, సీఐఐ వంటి సంస్థలతో పాటు సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌తో సమన్వయం చేసుకుంటోంది. దీనివల్ల విద్యార్థులకు తరగతి గది బోధనతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ లభిస్తోంది.
ముఖ్యంగా సైన్స్ ఫౌండేషన్ మూడేళ్ల కాలానికి రూ.7.5 కోట్ల పెట్టుబడితో స్టార్టప్స్, హ్యాకథాన్ల నిర్వహణకు ముందుకు రావడంతో విద్యార్థులకు చదువుకుంటూనే స్టైపెండ్ పొందే అవకాశం లభిస్తోంది. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల పట్ల విద్యార్థులు విశేష ఆసక్తి చూపుతున్నారు.
గత ఏడాది కేవలం 24 కాలేజీలకే పరిమితమైన ఈ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ఈ ఏడాది 96 కాలేజీలకు విస్తరించింది. సీట్ల సంఖ్యను కూడా 11 వేలకు పెంచింది. అలాగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా 180 కొత్త పేపర్లను ప్రవేశపెట్టి సిలబస్‌ను పూర్తిగా ఆధునీకరించారు. సెమీకండక్టర్లు, రోబోటిక్స్ వంటి నూతన రంగాల్లో ప్రవేశపెట్టిన 10 కొత్త కోర్సుల్లో 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
బోధనలోనూ మార్పు…
కేవలం కోర్సులు మార్చడమే కాకుండా, బోధనలోనూ నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. 1,600 మందికి పైగా లెక్చరర్లకు పారిశ్రామిక అవసరాలపై అవగాహన కల్పించేందుకు 110 ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహించింది. తద్వారా అధ్యాపకులు సైతం మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘విజన్-2047’ డాక్యుమెంట్లో భాగంగా భవిష్యత్తులో రానున్న ఫార్మా హబ్, ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్), ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులను ఇప్పటినుంచే సిద్ధం చేస్తోంది.
ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు కుదుర్చుకున్న ఒప్పందాలు కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో సర్కార్ కాలేజీల్లో మరిన్ని అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
