మాదారం అడవిలో ఘోర రోడ్డు ప్రమాదం..
- చెట్టును ఢీకొట్టిన కారు..
- ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం
- భార్యాభర్తలు, కుమారుడు అక్కడికక్కడే మృతి
ములకలపల్లి, ఆంధ్రప్రభ : మాదారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. భద్రాచలం వెంకటేశ్వర కాలనీకి చెందిన దూడల సాయిప్రకాష్ తన భార్య సంధ్య, కుమారుడు మోక్షిత్, తల్లి జ్యోతితో కలిసి ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మాదారం అడవి వద్దకు రాగానే సాయిప్రకాష్ కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిప్రకాష్, సంధ్య, మోక్షిత్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తల్లి జ్యోతిని చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీ గదిలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
