డిగ్రీ పరీక్షకు వచ్చి అదృశ్యం..

డిగ్రీ పరీక్షకు వచ్చి అదృశ్యం..

వివాహిత ఆచూకీ కోసం గాలింపు

నెల రోజుల క్రితమే వివాహం..

బస్టాండ్ ప్రాంతం నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన యువతి

ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన కదిరి టౌన్ పోలీసులు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ వివాహిత యువతి అదృశ్యమైన ఘటనపై శనివారం కదిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తలుపుల మండలం ఓబులపల్లి పంచాయతీ పరిధిలోని రాచువారిపల్లె గ్రామానికి చెందిన ఎం. ఓబుల్ రాజు (40) తన కుమార్తె మహాలక్ష్మి (22) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాలక్ష్మికి నెల రోజుల క్రితం పట్నం గ్రామానికి చెందిన పవన్ కుమార్‌తో వివాహం జరిగింది.

డిగ్రీ పరీక్ష రాయాల్సి ఉండటంతో శనివారం ఉదయం భర్తతో కలిసి మహాలక్ష్మి కదిరికి వచ్చింది. అనంతరం కదిరి బస్టాండ్ ప్రాంతం నుంచి ఆమె కనిపించకుండా వెళ్లిపోయింది.

కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్ల వద్ద గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి ఓబుల్ రాజు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కదిరి టౌన్ సీఐ తెలిపారు.