DSC Scam Exposed | సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

DSC Scam Exposed | సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

DSC Scam Exposed |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, శాంతిభద్రతల పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలసి వివరించనున్నట్లు తెలిపారు.

డీఎస్సీ నియామకాల్లో అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీ జరిగిందని, ఒక్కో పోస్టును రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు విక్రయించారని ఆరోపించారు.

క్రీడా కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికి ఔట్‌సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించారని విమర్శించారు. దీంతో వేలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని తెలిపారు.

అలాగే రాజధాని అమరావతి నిర్మాణాలపై కూడా వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నిర్మాణ వ్యయాలు, రహదారుల ఖర్చుల విషయంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, భూముల కేటాయింపులు, ప్రాజెక్టు వ్యయాలపై కూడా సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత శాఖల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.