45 గ్రామాల ఆశలు.. అండర్‌పాస్‌కు ఇంకా మోక్షం ఎప్పుడు?

45 గ్రామాల ఆశలు.. అండర్‌పాస్‌కు ఇంకా మోక్షం ఎప్పుడు?

అధికారుల సమన్వయ లోపంతో ఏడుేళ్లుగా పెండింగ్.. ఎంపీకి వినతిపత్రం అందజేసిన పోరాట సంఘం

నంద్యాల బ్యురో, ఆంధ్రప్రభ బ్యూరో: సుమారు 45 గ్రామాల ప్రజలు, వేలాది మంది ప్రయాణికులు, రైతుల సౌకర్యార్థం నిర్మించాల్సిన రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి (అండర్‌పాస్) పనులు ఏడు సంవత్సరాలుగా ముందుకు సాగకపోవడంపై నూనెపల్లె అభివృద్ధి కార్యాచరణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ సోమవారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్, ప్రముఖ న్యాయవాది బి. శంకరయ్యతో పాటు తోట పెద్ద మద్దిలేటి, బాల హుస్సేనయ్య, బాలగౌడ్, తోట ధనుంజయుడు, రామభూపాల్, బషీర్, రామమూర్తి, భాస్కర్ రెడ్డి, రామస్వామి, సురేష్, రామాంజనేయులు, వెంకటసుబ్బయ్య, నాగరత్నం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ, “దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని” పరిస్థితి ప్రస్తుతం నెలకొందని, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించినప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నూనెపల్లె మీదుగా పట్టణానికి చేరుకోవాలంటే సుమారు 45 గ్రామాల ప్రజలు ఈ రైల్వే మార్గాన్ని దాటాల్సి వస్తోందని, గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.

రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం కోసం పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్ చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారానికి ఎంపీ, మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి స్పందన లేదని విమర్శించారు.

గత ఏడాది నవంబర్ 28న రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) రైల్వే అండర్‌పాస్ నిర్మాణ వ్యయాన్ని రైల్వే శాఖ భరిస్తుందని, స్థల సేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపినట్లు తెలిపారు.

అయితే స్థల సేకరణ, నష్టపరిహారం అంచనాల విషయంలో రెవెన్యూ, రైల్వే, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ఏడు నెలలుగా ఎలాంటి పురోగతి లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ కీలక సమస్యపై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.