12times | ఎస్‌ఐఆర్ ప్రక్రియకు బీజేపీతో సంబంధం లేదు
12times | ఎస్‌ఐఆర్ ప్రక్రియకు బీజేపీతో సంబంధం లేదు
12times | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు సరికావని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీనే పలువురు సీఈసీలకు పద్మ పురస్కారాలు, రాజ్యసభ పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఖండించారు. ఎస్‌ఐఆర్ కొత్త ప్రక్రియ కాదని, గతంలోనే 12 సార్లు అమలైందని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌ఏ-2 (బూత్ లెవల్ ఏజెంట్)ను నియమించుకుంటుందని, ఓటర్ల జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆయా పార్టీలు వెంటనే తెలియజేసే అవకాశం ఉందని వివరించారు.
ఎస్‌ఐఆర్ ద్వారా కేవలం దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారని, చట్టబద్ధమైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోనే జరుగుతుందని, దీనికి భాజపా లేదా కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని రామచందర్‌రావు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనను రాజకీయ కోణంలో చూడకుండా ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.
