Mine-1 | హెచ్‌ఎంఎస్‌తో కలిసి కార్మిక ఉద్యమం

Mine-1 | హెచ్‌ఎంఎస్‌తో కలిసి కార్మిక ఉద్యమం

Mine-1 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధారణంగా జరగాల్సిన పనుల కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్, ఢిల్లీలో ఉండి సింగరేణికి కొత్త బొగ్గు గనులు తీసుకురావాల్సిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వినతిపత్రాలు ఇస్తూ కార్మికులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

‘బొగ్గుబాయి’ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కాసిపేట మైన్-1ను సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డులు, కార్మిక సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

నెలకు రెండుసార్లు నిర్వహించాల్సిన మెడికల్ బోర్డులను నిలిపివేశారని, హక్కుగా రావాల్సిన డిపెండెంట్ ఉద్యోగాల కోసం కార్మికులు పోరాటం చేయాల్సి వస్తోందని అన్నారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయిస్తే లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను ప్రోత్సహిస్తూ, అండర్‌గ్రౌండ్ మైనింగ్‌ను క్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే సంస్థకు బకాయిగా ఉన్న రూ.50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందుబాటులో లేవని, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన ‘పాంచజన్యం’ పేరిట ఐదు ప్రధాన అంశాలతో ప్రజల ముందుకు వస్తోందని, కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు.

తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, పార్టీ ఏర్పాటైన తర్వాత సింగరేణిలో నిర్వహిస్తున్న తొలి యాత్ర ఇదేనని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు సింగరేణి కార్మికుల పక్షాన నిలిచామని, భవిష్యత్తులో కూడా వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హెచ్‌ఎంఎస్‌తో కలిసి కార్మికుల సమస్యలపై పోరాడతామని, రానున్న ఎన్నికలు, ఉద్యమాల్లోనూ సంయుక్తంగా ముందుకు సాగుతామని కవిత వెల్లడించారు.