మామిడి తోటలో మత్తు ఫ్యాక్టరీ గుట్టురట్టు

  • మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ అరెస్ట్
  • రూ.కోటి విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్, యంత్రాలు స్వాధీనం
  • అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈగల్ ఫోర్స్ మెరుపుదాడి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ మామిడి తోటలో అత్యంత రహస్యంగా నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ ఫోర్స్ గుట్టురట్టు చేసింది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాలతో సంబంధాలు కలిగిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు కీసరి మత్స్యగిరితో పాటు అతడి అనుచరుడు నిమ్మల నరేష్‌ను అరెస్ట్ చేసింది.

నిందితుల నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్, రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ తయారీ యంత్రాలు, ముడిసరుకు, ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

కారులో డ్రగ్స్ తరలిస్తుండగా పట్టివేత

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, ఎల్బీనగర్ క్లూస్ టీమ్ సహకారంతో ఈగల్ ఫోర్స్ బృందాలు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన కీసరి మత్స్యగిరి (38), యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన నిమ్మల నరేష్ (38) కలిసి ఐ-20 కారులో డ్రగ్స్ తరలిస్తుండగా బాటసింగారం రోడ్డులోని శివాజీ మహరాజ్ విగ్రహం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

కెమిస్ట్‌గా మొదలై.. డ్రగ్ డాన్‌గా ఎదిగిన నిందితుడు

పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు కీసరి మత్స్యగిరి నేర చరిత్ర వెలుగులోకి వచ్చింది. 2015కు ముందు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ రసాయన పరిశ్రమలో కెమిస్ట్‌గా పనిచేసిన మత్స్యగిరి, అధిక డబ్బు సంపాదించాలనే ఆశతో గుజరాత్‌కు చెందిన డ్రగ్స్ ముఠాలతో చేతులు కలిపినట్లు గుర్తించారు.

అక్కడే మెఫెడ్రోన్ తయారీ పద్ధతులు నేర్చుకున్న అతడు, అనంతరం పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 2019లో ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన మత్స్యగిరి, అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పటికీ మళ్లీ డ్రగ్స్ తయారీ రంగంలోకి అడుగుపెట్టినట్లు దర్యాప్తులో తేలింది.

ఫేషియల్ గ్లో పౌడర్ పేరుతో మోసం

జైలు నుంచి విడుదలైన తర్వాత మత్స్యగిరి తన అనుచరుడు నరేష్‌తో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ మామిడి తోటలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశాడు. అక్కడి వాచ్‌మెన్‌కు నెలకు రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పి, ఫేషియల్ గ్లో పౌడర్ తయారు చేస్తున్నామని నమ్మించి డ్రగ్స్ ల్యాబ్‌ను నిర్వహించాడు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ముడిసరుకును తెప్పించి ఐదు రోజుల పాటు రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్‌ను తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తయారైన డ్రగ్స్‌ను విక్రయించేందుకు తరలిస్తుండగానే ఈగల్ ఫోర్స్ ఉచ్చులో చిక్కారు.

ముఠాలోని ఇతర సభ్యుల కోసం గాలింపు

ఈ వ్యవహారంలో డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడిసరుకు అందించిన ప్రభాకర్‌తో పాటు గుజరాత్‌కు చెందిన విజయ్, సంతోష్ అనే కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలపై కూడా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply