వ్యవసాయంలో కొత్త దిశగా అడుగులు..
మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : ఆర్గానిక్ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ నగరంలోని పాలమూరు గో ఆధార్ ఫార్మర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో అధికంగా రసాయనాల వినియోగం వల్ల నేల నాణ్యత తగ్గిపోవడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో రసాయనాలు, చీడపీడల మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పంటలను సాగు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉంటాయని తెలిపారు. రైతులు ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా వారి ఆదాయం పెరగడమే కాకుండా సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చన్నారు.
రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్గానిక్ పంటల మార్కెటింగ్‌కు తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైతులు సమూహాలుగా ఏర్పడి పనిచేయాలని సూచించారు.
ప్రతి గ్రామంలో ఆర్గానిక్ వ్యవసాయంపై చైతన్యం పెంచుతూ, పండించిన పంటలను నేరుగా వినియోగదారులకు అందించే విధానాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్గానిక్ ఆహార వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో రైతులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని మరింత విస్తరించే దిశగా కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, పాలమూరు గో ఆధార్ ఫార్మర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు ముకుంద్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్, రాజ్‌గోపాల్ గౌడ్, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
