NHRC | విశాఖ స్టీల్ ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్..
NHRC | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది.
ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో జరిగిన లోపాలు, ఘటన అనంతరం ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థలు తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.
అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారం చెల్లింపుల వివరాలు, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న వైద్య సహాయంపై కూడా పూర్తి సమాచారం అందించాలని సూచించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఎన్హెచ్ఆర్సీ జోక్యం ప్రాధాన్యత సంతరించుకుంది.
