117People | డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి: జూపల్లి
117People | ఆంధ్రప్రభ, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లోని ఎక్సైజ్ అకాడమీలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు.
ఆరు నెలలపాటు కఠిన శిక్షణ పూర్తి చేసిన 117 మంది అధికారులు ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో 33 మంది మహిళా అధికారులు, 84 మంది పురుష అధికారులు ఉన్నారు. మొత్తం 24 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు శిక్షణ పూర్తి చేశారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు మంత్రి పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ఎక్సైజ్ శాఖలో మహిళల భాగస్వామ్యం పెరగడం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ ప్రజాసేవకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ అని పేర్కొన్నారు. తెలంగాణ అమరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అభ్యర్థుల కష్టార్జిత విజయంతో పాటు అమరుల త్యాగాల ఫలితమని అన్నారు.
శిక్షణ ద్వారా చట్టాలపై అవగాహన, విచారణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందాయని, అయితే అసలు పరీక్ష క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలోనే ప్రారంభమవుతుందని సూచించారు. యూనిఫాం హోదాకు మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు.

ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయ శాఖ కాదని, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, తెలంగాణలోకి మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గంజాయి, మద్యం అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి, అక్రమార్కులు ఎంతటివారైనా చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. గతంలో నాటుసారా, గుడుంబా, కల్తీ కల్లు ప్రధాన సవాళ్లుగా ఉండగా, ప్రస్తుతం సింథటిక్ డ్రగ్స్, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లు కొత్త ముప్పుగా మారాయని అన్నారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై ప్రత్యేక నిఘా అవసరమని, మారుతున్న నేర ధోరణులకు అనుగుణంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఖురేషీ, అకాడమీ డైరెక్టర్ సురేష్, జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, జాయింట్ డైరెక్టర్ శశిధర్‌రెడ్డి, చీఫ్ డ్రిల్ ఇన్‌స్పెక్టర్ రంగారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
